దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక నెహ్రూ సెంటర్లో జరిగిన ఈ ప్రమాదంలో రెండు షాపులు దగ్ధమయ్యాయి. ఫెర్టిలైజర్ షాపుతో పాటు పక్కనే ఉన్న ఆటోమొబైల్ షాప్ మంటల్లో కాలిపోయాయి. షాపుల నుంచి భారీగా పొగ, మంటలు వ్యాపించడంతో అటుగా వెళ్తున్న వారు గుర్తించి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రెండు షాపుల్లో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.