సూర్యోదయానికి ముందే ఆ మహిళలు సముద్రం వైపు అడుగులు వేస్తారు. వారి ఒంటిపై డైవింగ్ సూట్లు, ఖరీదైన పరికరాలు ఉండవు. చీర కట్టుకుని, అద్దెకు తెచ్చుకున్న గాగుల్స్ పెట్టుకుని సముద్రంలోకి దిగుతారు. నడుముకు ఒక ప్లాస్టిక్ సంచి కట్టుకుని నీటిలో మునిగి సముద్రపు అడుగున పెరిగే నాచును సేకరిస్తారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొందరు మహిళలు సముద్రపు నాచు సేకరణనే జీవనాధారంగా చేసుకున్నారు. Sea Weed Divers : గల్ఫ్ ఆఫ్ మన్నార్ దీవుల సమీపంలోని సముద్రపు రాళ్లు, పగడపు దిబ్బలపై సముద్రపు నాచు పెరుగుతుంది. నాచును సేకరించేందుకు స్థానిక మహిళలు ప్రతిరోజూ సముద్రంలోకి డైవ్ చేస్తారు.