జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. నామినేషన్ల దాఖలు, ఉప సంహరణ, అనంతరం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాయిదా పడిన అభ్యర్థుల ప్రకటనను ఆదివారం అధికారులు విడుదల చేశారు. జీవీఎంసీ మేయర్ పదవికి 15 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ పదవికి 29 మంది నామినేషన్లు దాఖలుచేయగా ఎనిమిది నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారు. మిగిలిన 21 నామినేషన్లు ఆమోదించగా ఆరుగురు ఉపసంహరించుకోవడంతో 15 మంది తుదిపోటీలో నిలిచారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.దయానిధి అభ్యర్థుల తుదిజాబితాను ఆదివారం విడుదల చేశారు. కాగా 120 వార్డులకు 1,672 మంది నామినేషన్లు దాఖలుచేయగా, చివరకు 573 మంది పోటీలో నిలిచారు.